కాళహస్తీ సొరంగంలో 'అనంత' రాజసంపద

Published: Friday, August 10, 2012, 10:00 [IST]

Cave path found near Kalahasti temple
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలోని నగరి వీధిలో అద్దాలమహల్ భవన స్థలంలో భూగర్భంలో సొరంగ మార్గం బయట పడిన విషయం తెలిసిందే. ఈ సొరంగంలో విలువైన రాజసంపద ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తిరుపతి పురావస్తు శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణ తెలిపారు. సొరంగాన్ని ఆయన గురువారం పరిశీలన జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ భూమి లోపల రాతి కట్టడం కింద వెళ్తున్న మార్గం సొరంగ మార్గమేనన్నారు. ఇది చాలా పురాతనమైన చారిత్ర కట్టడమని తెలిపారు.

శ్రీకాళహస్తి జమీందారులు ఈ సొరంగంలో తమ సంపదను దాచిపెట్టి ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఏదైనా సంపద దొరికితే అది పురావస్తుశాఖ అధీనంలోకి వస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తిలోని అలనాటి అద్దాలమహల్ కింద భూగర్భంలో సొరంగమార్గం బయటపడడంతో ఇక్కడ విలువైన సంపద ఉన్నట్టు పట్టణంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో... అంటే నలభై ఏళ్ల క్రితం కొంతమంది అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి సొరంగమార్గం ఉన్నట్లు ద్రువీకరించారని చెబుతున్నారు.

స్థానికులు చాలామంది అద్దాలమహల్ కూల్చివేతకు ముందు తాము ఈ సొరంగ మార్గాన్ని, అక్కడే పాలరాతి కట్టడం కలిగిన ఈతకొలనును చూసినట్టు తెలిపారు. సొరంగంలో వెళితే కాళికాదేవి నిలువెత్తు విగ్రహం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సొరంగ మార్గం పట్టణ శివారులో రాజుల అతిథి భవనాలున్న కాసాగార్డెన్ వరకు ఉందని, కాసాగార్డెన్‌లోని ఈత కొలనుకు ఆ మార్గం గుండా రాణులు వెళ్లి విహరించే వారని అంటున్నారు. అలాగే శ్రీకాళహస్తీశ్వరాలయంనుంచి సమీపంలోని వేయిలింగాల కోనకు కూడా మార్గం ఉన్నట్టు చెబుతున్నారు.

అద్దాల మహల్‌కు కూతవేటు దూరంలోని దేవిడీ భవనం ఉంది. ఈ భవనం నుంచే పరిపాలనా వ్యవహారాలు సాగేవి. అక్కడకు కూడా సొరంగ మార్గం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తిలో శైవాలయాలు ఎక్కువ. దీంతో వైష్ణవుడైన ఇక్కడి రాజావారు ప్రస్తుతమున్న ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో వరదుని విగ్రహాన్ని ప్రతిష్టించి అప్పటిదాకా ఇక్కడున్న భక్తకన్నప్ప విగ్రహాన్ని తొలగించి పూలదుకాణాల వద్ద ప్రతిష్టించినట్లుగా ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఇలా వరదరాజస్వామి ఆలయానికి కూడా మహల్ నుంచి సొరంగ మార్గం ఉన్నట్టు చెబుతున్నారు.

Story first published: Friday, August 10, 2012, 10:00 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS