ఏనుగు నరసింహారెడ్డి కవిత 'పలక'

Published: Friday, August 10, 2012, 15:02 [IST]

A poem by Enugu Narasimha Reddy
అఆలు నేర్పించడానికి ముందు
తంగేడు చెట్టుకు వేసిన
మొగ్గతం స్వల్పమని
జీవితం గురించిన పాఠాలు చెప్పింది పలక

కొనిచ్చిన కొత్త పలకను
రెండు రోజుల్లోనే ముక్కులు చేశానని
మొట్టికాయలేసింది కానీ
పలక ముక్కలు చెప్పిన కథలు
అప్పుడు నాకు లాగానే
అమ్మకూ అర్థం కాలేదు.
ఎంతకూ తరిగిపోని
గుండె ధైర్యాన్ని పెంచుకోవాలని చెప్పలేక
అమ్మ నాకు రేకు పలక కొనిచ్చింది.
రజను రాలిపోతే నల్లబల్లకు లాగానే
బొగ్గాకు పసరు రాసుకోవచ్చని
పలక గురించి అనుకొని
జీవితం గురించిన పాఠాలు చెప్పింది

కోపు బలపంతో
కొత్త పలక మీద రాస్తుంటే
ఉన్నట్లుండి
నాలుగ్గంటలకు పెట్టే ఉప్మా గుర్తొచ్చి
ఊహల మర్రిచెట్టుకు
ఊయలలూగేది మనసు

అఆలు ఎన్ని వస్తాయన్న టీచరు ప్రశ్నకు
'పలక నిండా' అన్న నా జవాబుకి
ఆమె ఎందుకు పగలబడి నవ్విందో
నాకసలే అర్థం కాలేదు.

రెండే అక్షరాలను పలకనిండా రాసినప్పుడు
నవ్వడం సరే!
ఎడమ పైభాగాన మొదలైన గీత
కుడి కింది భాగానికి ఎందుకు జారిపోయిందో
గీతలు కొట్టిచ్చిన రాణీ టీచరును
స్వర్గానికి మెయిలు పెట్టి అడగాలిప్పుడు.

ఉప్మా నూనె రోజరోజూ తగిలి
రేకు పలక కూడా
బలపానికి లొంగకుండా పోయింది
మళ్లీ కొత్త పలక
అక్షింతలతో సహా
మళ్లీ కలలు
అబ్రకం లేకుండానే పెరిగిపోయిన నెమలీక
దుష్టబుద్ధి ఆశీర్వాదం ఫలించిన చంద్రహాసుడు

చెరిపి రాతలు, చూచి రాతలు, ఎత్తిరాతలు
ఎన్ని నేర్పింది పలక!
రాసీ రాసీ
బండి 'ర' మీద నుండి దూకితే కానీ
కరడాల కాపీకి అర్హతొచ్చేది
అప్పటి దాకా
పలక మీద రాసీ పలికీ
అర్హత సాధించాలి

ఎంతకూ వంటబట్టని
వర్కు బుక్కు కల్చరు కాదదని.
పలకను తల్చుకుంటే
నల్లని చీకట్లను తరిమేందుకు
ఒక తెల్లని దీపంలా ఎదురొచ్చిన
అక్షరం గుర్తొస్తుంది.
ఇప్పుడొక పలక దొరికితే బాగుండు
చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాలు
చాలా గుర్తొస్తున్నాయి.

పాలపిట్ట మాసపత్రిక సౌజన్యంతో.....

Story first published: Friday, August 10, 2012, 15:02 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS