దిశా నిర్దేశం చేసిన 'జగడం'

Updated: Thursday, August 2, 2012, 16:12 [IST]

Boya Jangaiah
తాను ఏది రాయాల్సిన అవసరం ఉందో బాగా గుర్తెరిగి అదే రాస్తున్న సాహిత్యవేత్త బోయ జంగయ్య. ఎవరి కోసం రాయాలో, ఎందుకు రాయాలో కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన కలం నుంచి వెలువడిందే 'జగడం' అనే నవల. ఆయన ఇంతకు ముందు 'జాతర' అనే నవల రాశారు. అది నెరవేర్చిన ప్రయోజనం అందరూ ఎరిగిందే. ఆ కాలంలో శ్రామిక స్త్రీ దృక్కోణం నుంచి ఆ నవల రాయడం బోయ జంగయ్య నిశిత దృష్టిని తెలియజేస్తుంది. జాతర తర్వాత ఆయన నుంచి వచ్చిన నవల జగడమే.

ఐదు దశాబ్దాల తెలుగు సామాజిక, రాజకీయ పరిణామ క్రమాన్ని చిత్రించిన నవల ఇది. రాజయ్య దళిత బాలుడు రాజం దళిత ఉద్యమకారుడిగా ఎదిగిన పరిణామ క్రమాన్ని చిత్రిస్తూ తెలుగు సమాజంలో దళిత చైతన్యం తెచ్చిన మార్పును బోయ జంగయ్య ఈ నవలలో విశ్లేషించారు. రాజం ఈ నవలలో ప్రధాన పాత్ర. రాజం ఆలోచనలోంచి అంబేడ్కర్ దృక్పథంతో బోయ జంగయ్య ఈ నవలలో చారిత్రక పరిణామ క్రమాన్ని చిత్రించారు.

దళితులకు కావాల్సిందేమిటో ఎరిగి, అందుకు చేయాల్సిందేమిటో స్పష్టంగా తెలియజేసిన నవల జగడం. తెలుగు సమాజంలో, ఆ మాటకొస్తే భారత సమాజంలో గుణాత్మకమైన మార్పు తేవడానికి దళిత చైతన్యం ఎంతగా ఉపకరిస్తుందో బోయ జంగయ్య ఈ నవలలో స్పష్టం చేసారు. దళిత సమస్యను బోయ జంగయ్య ఈ నవలలో వివిధ దృక్కోణాల నుంచి చిత్రీకరించారు. మానవ సమాజంలో అడుగడుగునా దళితులకు ఎదురయ్యే అవమానాలను చిత్రీకరిస్తూ వాటిని అధిగమించి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి, తనతో పాటు తనవారిని ఆ దిశగా నడిపించడానికి చేయాల్సిన కృషిని గుర్తించి కార్యరంగంలోకి దిగడానికి అవసరమైన ప్రాతిపదికను ఈ నవల అందిస్తుంది. దళిత చైతన్యం వెల్లివిరియడానికి దోహదపడిన చారిత్రక పరిణామ క్రమాన్ని ఈ నవల వివరిస్తుంది.

జగడం నవలలో 1947 - 48 ప్రాంతం నుంచి 1999 శానససభ ఎన్నికల వరకు తెలుగు సమాజంలో చోటు చేసుకున్న సామాజిక, రాజకీయ పరిణామాలను దళిత దృక్కోణం నుంచి చిత్రీకరిస్తూ దళితులు మరింత చైతన్యవంతులై రాజకీయాధికారం చేపట్టాలనే సందేశాన్ని రచయిత ఇచ్చారు. బోధించు, సమీకరించు, ఉద్యమించు అనే అంబేడ్కర్ నినాదం ఈ నవలకు ఆలంబన. ఇది ఆంతస్సూత్రంగా సాగుతుంది. గాంధీ నాయకత్వంలోని జాతీయోద్యమం, కమ్యూనిస్టు పోరాటాల వల్ల జరిగిన మేలును గుర్తిస్తూ, వాటి పట్ల సానుకూల వైఖరిని అవలంబిస్తూనే దళితులు చేయాల్సిన పోరాటాన్ని బోయ జంగయ్య ఈ నవలలో నిర్దేశించారు.

గాంధీ ఉద్యమానికి, కమ్యానిస్తు పోరాటానికి ఉన్న పరిమితులను ఆయన ఈ నవలలో జాగ్రత్తగా గర్భీకరించి చెప్పారు. కేవలం సంస్కరణ ఉద్యమాలుగా కొట్టి పారేసే విషయాలు దళిత జీవితాల్లో ఎంతటి పెను మార్పులు తెస్తాయో ఈ నవల కథనాత్మకంగా వివరిస్తుంది. మన దేశంలో కమ్యూనిజం ఎందుకు విస్తరించలేకపోయిందనే ప్రశ్నకు ఒక పాత్ర ద్వారా బోయ జగంయ్య చెప్పిన సమాధానం గురించి ఆలోచిస్తే విప్లవోద్యమ విస్తరణకు మార్గం దొరికే అవకాశాలు ఉండవచ్చు.

'కమ్యూనిజం ప్రేరణ చాలానే పని చేస్తూ వచ్చింది. ఆ ప్రేరణ లేకపోతే ఈ దేశంలో ఇన్ని మార్పులు చోటు చేసుకునేవి కావు. ఆత్మగౌరవం పేరిట కుటుంబ పాలనకు చుక్కెదురు కాకపోవచ్చు.. ఈ మేలుకొలుపు వెనక కమ్యూనిస్టు సిద్ధాంతాలు వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. కాకపోతే ప్రతిపక్ష పార్టీ ఈ దేశాన్ని ఏలకపోవచ్చు. అది వేరే విషయం. ఆ సూత్రాలే సామాన్యునికి ప్రశ్నించే తెలివిని నేర్పాయి. ఈ దేశంలో కులతత్వపు ఊడల మర్రి కింద కమ్యూనిజపు మొక్క ఎదగలేదు' అని రాజం స్నేహితుడు లక్ష్మీపతి విడమరిచి చెప్తాడు. ఈ మాటల్లో దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

ఆర్థిక అసమానతల కన్నా ముందు కుల అంతరాలు నశించాల్సిన అవసరం ఉందని జగడం నవలలోని రాజం అంటాడు. భారత సమాజం వర్గ సమాజంగా రూపుదిద్దుకుంటే తప్ప కమ్యూనిస్టు ఉద్యమాలు ముందుకు పోవని రాజం గుర్తిస్తాడు. '... భూస్వామి కొడుకు భూస్వామి, ధనవంతుడి కొడుకు ధనవంతుడు అవుతున్నారు' అని రెడ్డి అంటే 'దాని విషయంలో నేను యిప్పుడే ఏం మాట్లాడడం లేదు. అంతకంటే ముందు అంటువ్యాధి కంటే భయంకరమైన కులావమానం పోవాలి, వృత్తి విలువలు - అదే పని విలువలు పెరగాలి' అని రాజం అంటాడు. కుల అసమానతలు తగ్గి కులనిర్మూలన జరిగితే తప్ప వర్గం సమాజం ఏర్పడదు. వర్గ సమాజం ఏర్పడితే తప్ప కమ్యూనిస్టు ఉద్యమాలు విజయం సాధించవనే అర్థం రాజం మాటల్లో ఇమిడి ఉంది.

పని విలువ పెంచడమంటే శ్రమశక్తికి విలువ పెరగడమన్నమాట. కులాల పేర శ్రామికులు చేసే పనులకు కూడా విలువ కట్టడం, ఆ పనులకు విలువ తగ్గించడం భారత సమాజ నీతిగా ఉంటూ వస్తున్నది. ఈ నీతి తలకిందులు కావాలి. విలువలు వాటంతటవి తారుమారు కావు. ఈ విలువలు తారుమారు కావడానికి సాంస్కృతిక విప్లవం రావాలి. అత్యంత కింది స్థాయిగా గుర్తింపు పొందిన దళితుల సంస్కృతికి విలువ పెరగాలి.

విడివిడిగా వ్యక్తులుగా కాకుండా ఒక పరిమాణాత్మక మార్పు జరగాలి. ఈ విషయాన్ని బోయ జంగయ్య గుర్తించారు. కాబట్టే దళితులు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుంటూ తమ జీవితాలకు సమాజంలో ఉన్నత విలువలను సంతరింపజేసుకోవడానికి చదువు అనేది ఒక పదునైన ఆయుధంగా పనికి వస్తుందనే విషయాన్ని దళిత మేధావులు గుర్తించారు. చదువుకోవడానికి అంది వచ్చిన అవకాశాలను గుర్తించి వాటిని వాడుకోవాలనేది వారు చెబుతూ వస్తున్న విషయం. ఇందులో మిత్ర అనే వ్యక్తి రాజం వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి, అతను దళిత ప్రతినిధిగా ఎదగడానికి అవసరమైన ప్రాతిపదికను ఎప్పుటికప్పుడు ఏర్పాటు చేస్తూ పోతుంటాడు.

బోయ జంగయ్య రచనలు దళితులు శాస్త్రీయ అవగాహనను పొంపొందించుకోవాల్సిన అవసరాన్ని చెబుతూ వస్తున్నాయి. దళితుల ఆచారవ్యవహారాల్లోని, పండుగలు పబ్బాల్లోని అశాస్త్రీయతను ఆయన జగడం నవలలో కూడా ఎత్తి చూపుతూ వాటిని దళితులు దూరం చేసుకోవాల్సిన అవసరాన్ని మరీ మరీ నొక్తి చెప్తారు. మూఢనమ్మకాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ... 'దళితులకు కావలసింది గుడి కాదు బడి, చదువు' అని రాజం అంటాడు. దేశంలోని ఓటర్లందరూ కనీసం చదవడం రాయడం నేర్చుకున్ననాడే దేశంలో స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందనే రాజం విశ్వాసం. అది తప్పకుండా జరుగుతుందనే విశ్వాసం కూడా అతనికి ఉంది. ఇది రచయిత బోయ జంగయ్య విశ్వాసం అని కూాడ మనం అనుకోవచ్చు.

అంబేడ్కర్ పరిమితులను కూడా రాజం గుర్తించాడు. చట్టసభలకు వెళ్లడం వల్ల దళిత మేధావుల, నాయకుల స్వేచ్ఛకు పరిమితులు ఏర్పడతాయని, చేయాల్సినంత చేయలేమని, ఒక చట్రంలో దళితుల కోసం అనుకున్నంత పని చేయడం సాధ్యం కాదని రాజం విశ్వసిస్తాడు. అందుకు అంబేడ్కర్ చట్టసభల్లో చేయలేని విషయాలను చెప్తాడు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల నుంచి రాజంపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకు ఆయన నిరాకరిస్తాడు. ఆ నిరాకరణకు రాజం ఆ వివరణంతా ఇస్తాడు.

ముందు దళిత సమాజం చదువుకుని, చైతన్యం పొందుతూ, తమపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎదిరించడానికి అవసరమైన పోరాట పటిమను అందిస్తూ దళిత నాయకులు, మేధావులు స్వతంత్రంగానే సాగాలనే సందేశాన్ని జగడం నవల అందిస్తుంది. మొత్తం పీడితుల పక్షాన జరిగే వర్గపోరాటం ఊపందుకోవడానికి దళిత సమాజం ఎదిగి పౌరులుగా గుర్తింపు పొందాలనే అంతస్సూత్రం కూడా ఈ నవలలో ఉంది. ఆ రకంగా మిగతా అగ్రకులాలవారు దళితీకరణ చెందాల్సిన అవసరాన్ని ఈ నవల చెప్పకనే చెబుతుంది. అంతిమంగా ఈ నవల ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు ముందుకు సాగడానికి అవసరమైన సందర్భాన్ని కల్పిస్తుంది.

ప్రజా ఉద్యమాలకు ప్రతికూల అంశాలుగా స్థూల దృష్టికి కనిపించే కొన్ని అంశాల సారాన్ని గ్రహించగలిగితే సానుకూల అంశాలు ఎలా అవుతాయో జగడం నవల తెలియజేస్తుంది. రిజర్వేషన్ అనుకూల ఉద్యమం, కాన్షీరామ్ రాజకీయాలు, ఇంకా కొన్ని ఇతర అంశాలను దళిత దృక్కోణం నుంచి ఆలోచిస్తే వాటి పాజిటివ్ అంశాలు వెల్లడవుతాయి. బోయ జంగయ్య జగడం నవలలో ఆ పని చేశారు. ఈ దృష్టికోణంతో జగడం నవలను ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజా రాజకీయాల పట్ల ప్రేమ కలిగినవారందరూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక చరిత్రను నవలగా రాయడానికి అవసరమైన నిర్మాణవ్యూహాన్ని బోయ జంగయ్య అనుసరించి దానికి పఠనయోగ్యతను కలిగించారు. క్లుప్తత ఆయన రచనలకు ప్రాణం. అదే క్లుప్తతను ఆయన ఈ నవలలో పాటించారు.

- కాసుల ప్రతాప రెడ్డి

Story first published: Thursday, August 02, 2012, 14:31 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS