50 వేల ఎకరాల్లో ఐటి కంపెనీల విస్తరణ: పొన్నాల

Published: Saturday, September 8, 2012, 14:50 [IST]

Ponnala Laxmaiah
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఐటి సంస్థల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నగరం పరిసరాల్లోని మూడు ప్రాంతాల్లో 50 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మామిడిపల్లి - రావిర్యాల, ఆదిభట్ల - మహేశ్వరం, ఉప్పల్ - పోచారం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

కొత్త ఐటి సంస్థల విస్తరణతో ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 50 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ఐటి వ్యాపార లావాదేవీలు 2 లక్షల 35 కోట్ల రూపాయలకు పెరుగుతాయని ఆయన చెప్పారు. ఇదిలావుంటే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలపై క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా 25వ వార్షికోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.

పరిశ్రమల అభివృద్ధిలో హైదరాబాద్ నగరం ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. పరిశ్రమల ఉత్పత్తిలో నాణ్యత లోపిస్తే వాటి వల్ల ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. నాణ్యతను పెంపొందించే విధంగా ఉత్పత్తులను మెరుగు పరచాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని పరిశ్రమలకు ప్రభుత్వం తరపున సహాయసహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు.

స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు కుంభకోణాలను చూస్తే డబ్బును ఇతరులకు దోచిపెట్టడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అర్థమవుతుందని లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రజలకు అవసరమైన, నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్సించారు. పారిశ్రామికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి పూర్తిగా పెద్ద పీట వేస్తున్నాయని, నాణ్యతా ప్రమాణాలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

Story first published: Saturday, September 08, 2012, 14:50 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS