'ఎన్టీఆర్ ఆత్మశాంతికి బాబు, వైయస్ ఆత్మశాంతికి జగన్'

Published: Thursday, August 23, 2012, 17:43 [IST]

Shamuel
గుంటూరు: స్వర్గీయ ఎన్టీ రామారావు వారసుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్యాంధ్రకు కట్టుబడి పని చేయాలని సమైక్యాంధ్ర రాజకీయ జెఎసి కన్వీనర్ శామ్యూల్ అన్నారు. సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల్లోని 14 విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఏర్పడిన సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి సమావేశం గురువారం నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఢిల్లీ వరకు వెళ్లి తాము సమైక్యవాదాన్ని వినిపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాయవద్దని ఆయన చంద్రబాబును కోరారు. పార్టీ పోలిట్‌బ్యూరోలోని ఒకరిద్దరు తెలంగాణ నేతల ఒత్తిడికి తలొగ్గి సమైక్యవాదాన్ని వీడవద్దని ఆయన సూచించారు. తెలుగుజాతి ఐక్యత కోసం, అభివృద్ధి కోసం పనిచేసిన ఎన్టీఆర్ వారసుడిగా చంద్రబాబు వ్యవహరించాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం సమైక్యవాదానికి కట్టుబడి ఉందని, అందువల్ల ఎన్టీఆర్ వారసుడిగా చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తారని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ ఆత్మశాంతి కోసం చంద్రబాబు, వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మశాంతి కోసం వైయస్ జగన్ సమైక్యాంధ్ర కోసం నడుం బిగించాలని ఆయన కోరారు. వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో వైయస్ జగన్ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించి సమైక్యవాదాన్ని వినిపించారని ఆయన అన్నారు. అవసరమైతే చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇస్తామని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర సమైక్యతను కాపాడారని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన ప్రయత్నాలను అడ్డుకుంటామని విద్యార్థి జెఎసి నేత కిశోర్ అన్నారు. కొద్ది మంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తే తాము సహించబోమని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనని రాజకీయ నాయకులు ప్రజలు తిరస్కరిస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర సమైక్యతను కాపాడని రాజకీయ నాయకులను కూడా ప్రజలు తిరస్కరిస్తారని ఆయన అన్నారు. ప్రాంతీయ ఉద్యమాల్లో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కొద్ది రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన తెలంగాణ విద్యార్థులను కోరారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని, చర్చలకు రావాలని, రమ్మంటే తామైనా వస్తాని ఆయన తెలంగాణ విద్యార్థులనుద్దేశించి అన్నారు.

Story first published: Thursday, August 23, 2012, 17:43 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS