వైయస్ విజయమ్మ మాట్లాడటమా: దేవేందర్ గౌడ్

Published: Monday, August 20, 2012, 9:07 [IST]

Devender Goud
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఆదివారం అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన, పెత్తందారీ పోకడలుగల వ్యక్తుల సముదాయమైన వైయస్సార్ కాంగ్రెసు బిసి డిక్లరేషన్ పైన మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉండి, ముఖ్యమంత్రిగా ఆమె భర్త దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, బిసి సంక్షేమ శాఖకు అగ్రవర్ణాలవారిని మంత్రిగా నియమించి, వారిని అవమానించారని పేర్కొన్నారు. సెజ్‌ల పేరిట సాగిన వైయస్ భూదోపిడీలో జీవనాధారం కోల్పోయినవారిలో అధికశాతం బడుగు, బలహీనవర్గాలేనన్నా రు. ముఖ్యమంత్రి పదవి కోసం యత్నించి భంగపడి, అధికారదాహంతో పార్టీ పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టేందుకు య త్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

బిసిలకు తామేం చేస్తామో చెప్పకపోగా స్వార్థ రాజకీయాలకు పాల్పడటం అన్యాయం, హేయమని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ కుటుంబం మొదటి నుంచీ బిసిలకు అన్యాయం చేస్తోందని టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మరో ప్రకటనలో ఆరోపించారు. టిడిపి డిక్లరేషన్‌తో దిక్కుతోచక రాజకీయ కుట్రలతో బిసిలను మభ్యపెట్టేందుకు విజయమ్మ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

బిసిలపై విజయమ్మ కపట ప్రేమ చూపుతున్నారని టిడిపి కార్యదర్శి బండ్రు శోభారాణి ధ్వజమెత్తారు. బిసిలపై అంత ప్రేమ ఉంటే... కేంద్రానికి, కాంగ్రెస్‌కు లేఖ రాయకుండా టిడిపికి రాయడం రాజకీయం చేయడానికేనన్నారు. కడప జిల్లాలో ఏ సామాజిక వర్గం వైయస్ హయాంలో ఎంత అభివృద్ధి చెందిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Story first published: Monday, August 20, 2012, 09:07 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS