మీరే కాదు మేమూ రెడీ: బాబుకు విజయమ్మ సవాల్

Published: Sunday, August 19, 2012, 13:48 [IST]

Chandrababu Naidu - YS Vijayamma
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఆమె బిసిలకు వంద సీట్లు ఇచ్చే అంశంపై బాబుకు సవాల్ విసిరారు. వచ్చే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మాత్రమే బిసిలకు వంద సీట్లు ఇవ్వడం కాదని, తాము కూడా ఇస్తామని విజయమ్మ తన లేఖలో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీతో పాటు తమ పార్టీ కూడా బిసిలకు వంద సీట్లు కేటాయిస్తే మిగిలిన పార్టీలు కూడా అలా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బిసిలకు వంద టిక్కెట్లు ఇవ్వడం కాదని, వారిని వంద సీట్లలో గెలిపించాలని ఈ తన సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా అన్నారు. బిసిలకు వంద టిక్కెట్లు ఇద్దామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నియోజకవర్గాలలో వారిని పక్కకు పెట్టవద్దని బాబుకు ఆ లేఖలో సూచించారు. బిసిల నియోజకవర్గాలలో ఎవరూ పోటీ చేయకూడదని ప్రతిపాదించారు.

పై వర్గాలు ఉన్న నియోజకవర్గాలు మినహాయించి, మిగిలిన నియోజకవర్గాలలో బిసిలు అధికంగా ఉన్న ప్రాతిపదికన వారికే సీట్లు కేటాయించారన్నారు. టిడిపి వలే బిసిలకు వంద సీట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటగా దీనిని నేను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. వంద సీట్లలో బిసిలను గెలిపించడం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నియోజకవర్గాలను మినహాయించడం అంశాలపై బాబు తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.

బిసిలకు ప్రాధాన్యత విషయమై స్థానిక సంస్థల ఎన్నికలలోనే వైయస్ జగన్ చేశారని, కానీ చంద్రబాబు ఆ ప్రతిపాదన మీద స్పందించలదన్నారు. 2009 సాధారణ ఎన్నికలలో బిసిలకు వంద సీట్లిస్తామని ప్రకటించిన బాబు కేవలం 47 సీట్లను మాత్రమే ఇచ్చారని, కానీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రం చెప్పకుండానే 67 సీట్లు ఇచ్చారన్నారు. తమ పార్టీ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తుందని విజయమ్మ అన్నారు.

Story first published: Sunday, August 19, 2012, 13:48 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS