అనర్హతపై కోర్టుకు ఎక్కిన కొండా మురళి, తీవ్ర వ్యాఖ్యలు

Published: Friday, August 17, 2012, 14:54 [IST]

Konda Murali
హైదరాబాద్: ఎమ్మెల్సీగా తనపై శాసనమండలి చైర్మన్ చక్రపాణి తనపై అనర్హత వేటు వేయడాన్ని వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళి శుక్రవారం హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. శాసనమండలి చైర్మన్ చైర్మన్ చక్రపాణిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. చక్రపాణి న్యాయబద్దంగా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు.

చక్రపాణి శాసనమండలి చైర్మన్‌గా వ్యవహరించకుండా, కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుసారం వ్యవహరించి తనపై అనర్హత వేటు వేశారని ఆయన ఆరోపించారు. విప్ శివరామిరెడ్డి ఆడించినట్లుగా చక్రపాణి ఆడించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కొండా మురళిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ విప్ శివరామి రెడ్డి చక్రపాణికి ఫిర్యాదు చేశారు.

శివరామిరెడ్డి ఫిర్యాదుపై విచారణ జరిపిన చక్రపాణి నెల రోజుల క్రితం కొండా మురళిపై అనర్హత వేటు వేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి, పుల్లా పద్మావతిపై కూడా శివరామి రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, ఎస్వీ మోహన్ రెడ్డి ముందుగానే రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్లినందుకు పుల్లా పద్మావతి క్షమాపణ చెప్పి తిరిగి కాంగ్రెసులోకి వచ్చారు. దీంతో ఆమె అనర్హత వేటు నుంచి బయటపడ్డారు.

కొండా మురళితో పాటు ఆయన సతీమణి కొండా సురేఖ మొదటి నుంచి వైయస్ జగన్ వంట నడుస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వారిద్దరు క్రియాశీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. శాసనసభ్యురాలిగా ఉన్న కొండా సురేఖ రాజీనామా చేశారు. అయితే, ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఆమెపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ కారణంగా ఖాళీ అయిన పరకాల శాసనసభా నియోజకవర్గం నుంచి ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Story first published: Friday, August 17, 2012, 14:54 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS