రుయాలో పిల్లల మృత్యుఘోష: భూమన ధర్నా

Published: Thursday, August 16, 2012, 17:47 [IST]

Ruya Hospital
తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో చిన్నారుల మృత్యు ఘోష వినిపిస్తోంది. గత రెండు రోజులుగా 15 మంది పిల్లలు మృత్యువు ఒడిలోకి చేరారు. తాజాగా గురువారం ముగ్గురు పిల్లలు మరణించారు. వీరిలో ఒకరు తిరుపతికి చెందిన చిన్నారి కాగా, మరో ఇద్దరు నాయుడుపెట్కు చెందినవారు. ఈ స్థితిలో మరణాలపై వైద్యుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి శాసనసభ్యుడు తిరుపతి రుయా ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.

అంతకు ముందు రుయా ఆస్పత్రిని మంత్రి గల్లా అరుణ కుమారి సందర్శించారు. రుయా ఆస్పత్రి తీరుకు నిరసనగా బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో గల్లా అరుణ కుమారి ఆస్పత్రికి వచ్చారు. దీంతో ఆమెను బిజెపి నేతలు అడ్డుకున్నారు. తాను పరామర్శకు వచ్చానని, అడ్డుకోవడం సరి కాదని మంత్రి వారికి సర్ది చెప్పారు. రుయా ఆస్పత్రిలవో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని ఆస్పత్రిని పరిశీలించిన తర్వాత గల్లా అరుణ కుమారి అన్నారు.

చిన్నపిల్లల మరణాలకు వైద్యులు కారణం కాదని, ప్రైవేట్ ఆస్పత్రిలో పిల్లల పరిస్థితి సీరియస్‌గా మారిన తర్వాతనే రుయాకు బలవంతంగా పంపిస్తున్నారని, అందుకే రుయాలో చిన్న పిల్లల మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె అన్నారు. నిధుల కొరత విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని ఆమె చెప్పారు.

కాగా, పిల్లల మరణాలపై రాష్ట్ర వైద్యాధికారులు గురువారం విచారణ ప్రారంభించారు. ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడంతో చిత్తూరు జిల్లా వైద్యాధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి వచ్చారు. రుయా ఆస్పత్రిలోనే 90 పడకల మీద 206 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి గల్లా అరుణకుమారి చెప్పారు. రుయాలో వైద్యుల కొరత కూడా ఉందని ఆమె చెప్పారు.

ఇలా వుంటే, రుయా ఆస్పత్రిలో ఇంకుబేటర్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో 20 ఇంకుబేటర్లు ఉంటే 12 మాత్రమే పనిచేస్తున్నాయని, ఒక్కో ఇంకుబేటర్‌లో ఇద్దరు, ముగ్గురు పిల్లలను ఉంచుతున్నారని, దీంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకుతోందని, ఆ వ్యాధికి చికిత్స అందించే లోపలే పిల్లలు మృత్యువాత పడుతున్నారని అంటున్నారు.

Story first published: Thursday, August 16, 2012, 17:47 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS