బాబుపై శివాజీ ఫైర్: పార్టీ పెట్టి చిత్తు చేస్తామని హెచ్చరిక

Published: Tuesday, August 14, 2012, 8:28 [IST]

Karem Shivaji
హైదరాబాద్: రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని మాల మహానాడు నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్లోనే దానిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తెలుగుదేశం పొలిట్‌బ్యూరో తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కారెం శివాజీ నేతృత్వంలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

వర్గీకరణపై తెలుగుదేశం వైఖరిపై కారెం శివాజీ ధ్వజమెత్తారు. దళితులను వాడుకుంటున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు మాలల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని డిసెంబర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు శివాజీ ప్రకటించారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం భూస్థాపితం చేస్తామని, తెలుగుదేశం పార్టీ నేతలను మాల పల్లెల్లో తిరగనివ్వబోమని, ఎస్సీల వర్గీకరణపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు.

తెలుగుదేశం వైఖరికి నిరసనగా అక్టోబర్ 14న తెలుగుదేసం కార్యాలయంతోపాటు చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 25న అన్ని జిల్లాల్లోని తెలుగుదేశం కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. మాల నేతలంతా తెలుగుదేశం వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని, లక్షింపేట ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని శివాజీ డిమాండ్ చేశారు. అనంతరం బషీర్‌బాగ్ చౌరస్తాలో బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశంలో టి.కాశన్న, పశుల రాంమూర్తి, సునీత, మల్లేశ్, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Story first published: Tuesday, August 14, 2012, 08:28 [IST]
Topics: malas manda krishna madiga mrps chandrababu naidu telugudesam hyderabad మాలలు మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీయస్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హైదరాబాద్
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS