ఎల్లుండి జగన్ బెయిల్‌పై విచారణ: శ్రీలక్ష్మి పిటిషన్ ఓకే

Published: Tuesday, August 7, 2012, 15:00 [IST]

YS Jagan - Srilaxmi
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ ఈ నెల 9వ తేదిన సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జగన్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సుప్రీం కోర్టును ఇటీవల ఆశ్రయించారు. దీనిని సుప్రీం విచారణకు స్వీకరించింది. ఇది 9న విచారణకు రానుంది.

శ్రీలక్ష్మి బెయిల్ కేసు విచారణ 13న

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. తదుపరి వాదనలను ఈ నెల 13వ తేదికి వాయిదా వేసింది. ఇప్పటికే ఆమె నాంపల్లిలోని సిబిఐ కోర్టు, హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత సుప్రీంను ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు. కింది కోర్టులోనే వాదనలు వినిపించాలని సుప్రీం సూచించడంతో ఆమె మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మోపిదేవి బెయిల్ పిటిషన్ కూడా..

జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్‌పై విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 10వ తేదికి వాయిదా వేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా మోపిదేవి ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించింది.

Story first published: Tuesday, August 07, 2012, 15:00 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS