మంత్రుల మధ్య ఫీజు చిచ్చు: దానం, ముఖేష్ గుర్రు

Published: Tuesday, August 7, 2012, 13:42 [IST]

Danam Nagender-Mukesh Goud
హైదరాబాద్: మంత్రుల కమిటీ బిసి విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్ పైన చేసిన సిఫార్సులపై పలువురు మంత్రులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిసి విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్స్‌ను ప్రభుత్వమే చెల్లించాలని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల ఫీజులు చెల్లిస్తున్నట్లే బిసి విద్యార్థుల ఫీజులు కూడా భరించాల్సిందే అన్నారు. లేదంటే కాంగ్రెసు పార్టీ, ప్రస్తుత ప్రభుత్వం బిసిలకు వ్యతిరేకం అని ప్రజలు భావించే అవకాశముందని అన్నారు.

బిసిల పట్ల కాంగ్రెసు సవతి తల్లి ప్రేమ చూపిస్తే పార్టీకి వచ్చే ఎన్నికలలో నష్టం జరుగుతుందన్నారు. పార్టీ నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయాలనే ఆసక్తి వేళ్లూకున్న ప్రస్తుత పరిస్థితుల్లో బిసిలను పక్కన పెట్టడం సరికాదన్నారు. ప్రతిపక్ష పార్టీలు బిసిల కోసం ప్రత్యేక అజెండా, డిక్లరేషన్‌లు చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్న మనం మాత్రం వ్యతిరేకంగా ఉండటం అభ్యంతరకరమన్నారు.

బిసిల పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఈ విషయంపై మంత్రుల సిఫార్సులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేయాల్సిందిగా అడుగుతామన్నారు. మంత్రుల కమిటీ పునరాలోచించాలని మరో మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. కమిటీ సిఫార్సులు బాధ కలిగించాయన్నారు. ఆర్థిక భారమైనప్పటికీ ఫీజులు చెల్లించాలని లేదంటే నష్టం జరుగుతుందన్నారు.

తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ... ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంలో ప్రభుత్వం తీరు దారుణమన్నారు. బిసి పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసేందుకే కోత విధించారన్నారు. బిసిల్లో పూటగడవని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని, దీనిని ప్రభుత్వం గుర్తించాలని దేవేందర్ గౌడ్ సూచించారు.

ఓట్ల కోసమే కాంగ్రెసు ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్సు పథకాన్ని ప్రారంభించిందని, ఇప్పుడు ఈ పథకాన్ని అటకెక్కించిందని తెరాస ఎమ్మెల్యే కెటిఆర్ విమర్శించారు. ఫీజుల చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా ఎలాంటి కౌన్సెలింగ్‌లను నిర్వహించవద్దని సూచించారు. ప్రభుత్వ తీరుతో 17 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారన్నారు.

Story first published: Tuesday, August 07, 2012, 13:42 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS