చిరు సిఎం, మేం కిరణ్‌కు పనికి రామేమో: సిఆర్

Published: Tuesday, August 7, 2012, 18:42 [IST]

C Ramachandraiah
హైదరాబాద్: తమ నేత, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారనే తన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నట్లు దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య చెప్పారు. చిరంజీవి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం తనకు ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారనే తన వ్యాఖ్యల్లో తప్పు లేదని ఆయన అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారంటే కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో వస్తారని కాదని ఆయన వివరణ ఇచ్చారు.

రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నమ్మకమైనవారికి మాత్రమే జిల్లా ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారని, జిల్లా ఇంచార్జీ బాధ్యతలు అప్పగింత ముఖ్యమంత్రి ఇష్టమేనని ఆయన అన్నారు. అందుకు తమ కడప జిల్లా మంత్రులం పనికి రామేమోనని, అందుకే జిల్లా ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వలేదని ఆయన అన్నారు.

గ్యాస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. గ్యాస్ మళ్లింపులో తప్పిదమంతా గత ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడిలదేనని ఆయన అన్నారు. గ్యాస్ కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోదని, రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపు కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ ఉండాల్సిందేనని ఆయన అన్నారు. బిసీలకు అన్యాయం జరిగితే తాను అడ్డుకుంటానని ఆయన చెప్పారు. బాసరలో రెండు దశల్లో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆగమశాస్త్రాల ప్రకారం కొత్త పుష్కరిణిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రూ. 64 కోట్లతో శ్రీశైలం అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతామని, ఆలయ ప్రాకారాన్ని కాపాడడానికి కన్సల్టెన్సీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

Story first published: Tuesday, August 07, 2012, 18:42 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS