తెలంగాణ: బొత్స, కెసిఆర్‌లపై లగడపాటి విసుర్లు

Published: Monday, July 23, 2012, 18:53 [IST]

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరోక్షంగా విమర్శించి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రం విడిపోతే ఏమవుతుందని అన్నవారు కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అడ్డుకుంటే ఎందుకు ప్రశ్నించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోగా, అడ్డుకోవడాన్ని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. పొత్తూరి వెంకటేశ్వర రావు వంటి మేధావులు కూడా కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు.

దేశం విచ్ఛిన్నం కాకూడదనే ఉద్దేశంతోనే తాను సమైక్యవాదాన్ని వినిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తుంటే కలిసి ఉన్నప్పుడే అడ్డుకుంటుంటే రాష్టం విడిపోతే ఏమవుతుందో ఊహించలేరా అని ఆయన అడిగారు. సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందని సంకేతాలు అందినట్లు కెసిఆర్ చెబుతున్న మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. దొంగ మాటలతో ప్రజలను కెసిఆర్ మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయని తెరాస ఐదేళ్ల పాటు తెలంగాణ రాదని అంగీకరించినట్లేనా, తెలంగాణపై ఆశలు వదులుకున్నట్లేనా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతున్నారని, పార్టీలకు అతీతంగా నాయకుల పర్యటనకు భద్రత కల్పిస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు సహకరిస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు, వైయస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు ఆటంకాలు లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి భద్రతా ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఐదేళ్ల పాటు రాష్ట్రపతిగా ఉంటారని, ఈ ఐదేళ్లు తెలంగాణ రాదని కెసిఆర్ అంగీకరించినట్లే కదా అని ఆయన అన్నారు.

Story first published: Monday, July 23, 2012, 18:53 [IST]
Topics: lagadapati rajagopal congress telangana vijayawada లగడపాటి రాజగోపాల్ కాంగ్రెసు తెలంగాణ విజయవాడ
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS