రాహుల్ గాంధీతో జగన్‌కు పోలిక లేదు: లగడపాటి

Updated: Thursday, July 19, 2012, 13:46 [IST]

Rahul Gandhi-YS Jagan
న్యూఢిల్లీ: ఏఐసిసి ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పోలిక లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం న్యూఢిల్లీలో అన్నారు. ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి లేని పదవుల కోసం, రాని పదవుల కోసం తాపత్రయ పడుతున్నారని, అందుకోసం రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కాంగ్రెసు పార్టీనే తూలనాడాడని విమర్చించారు. అదే రాహుల్ గాంధీ తనకు రెండుసార్లు అత్యున్నత ప్రధానమంత్రి పదవి వచ్చినప్పటికీ ఆయన నిరాకరించారన్నారు. రాజకీయ అనుభవం పూర్తిగా వచ్చాకే పదవి చేపట్టేందుకు ఆయన సిద్ధపడ్డారన్నారు.

జగన్ పదవుల కోసం తాపత్రయ పడుతుండగా, రాహుల్ గాంధీ వచ్చిన పదవులను తృణపాయంగా వదులుకున్న వ్యక్తి అన్నారు. జగన్‌ది అవకాశవాదమన్నారు. రాహుల్‌తో పాటు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రధాని పదవిని వదులుకున్నారన్నారు. పదవుల కోసం కొట్లాడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండటం గమనార్హమన్నారు. రాహుల్ పార్టీలో, ప్రభుత్వంలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని ఆయన అభిలాషించారు.

పదవులు ఆశించకుండా పదేళ్లు రాహుల్ పార్టీ కోసం పని చేశారన్నారు. మతతత్వ బిజెపి పార్టీకి ఎవరీ మద్దతివ్వవద్దన్నారు. కాగా 2014లోపు రాహుల్ గాంధీ పార్టీ, ప్రభుత్వంపై పట్టు సాధించాలని కాంగ్రెసు సీనియర్లు పలువురు కోరుకుంటున్నారు.

Story first published: Thursday, July 19, 2012, 13:43 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS