జగన్ కేసు: మేకపాటి మాటల ఆంతర్యం ఏమిటి?

Published: Wednesday, July 18, 2012, 19:42 [IST]

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. జగన్‌ను వేధించడానికి కాంగ్రెసు పార్టీ విచారణ పేర సిబిఐని ప్రయోగిస్తోందని విమర్శిస్తూ వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చినట్లు మేకపాటి మాటలను బట్టి తెలుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసు కోర్టు పరిధిలోదని, ఈ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ప్రమేయం ఉంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించే సమయంలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తదితరులను కలిసి వచ్చిన తర్వాత జగన్‌ 15 రోజుల్లో బెయిల్‌పై బయటకు వస్తారని అన్నారు. ఆ మాటలకు తాజా మేకపాటి మాటలను జత చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.

అయితే, వైయస్ విజయమ్మ మాటలు యాదృచ్ఛికమేనని, కోర్టులను కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రభావితం చేస్తుందని అనుకోవడం లేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. లోపాయికారి ఒప్పందం మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు ఈ మాటలతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై దుమ్మెత్తి పోయడం ప్రారంభించింది.

జగన్‌కు 15 రోజుల్లో బెయిల్ వస్తుందని ప్రధానిని కలిసి వచ్చిన తర్వాతనే వైయస్ విజయమ్మ చెప్పారని తెలుగదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జగన్‌పై కాంగ్రెసు పార్టీయే కేసులు పెట్టించిందని ఉప ఎన్నికల ప్రచారంలో ఆరోపించారని, ఇప్పుడు మేకపాటి కాంగ్రెసు ప్రమేయం లేదని అనడాన్ని బట్టి రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని తేలిపోయిందని ఆయన అన్నారు. మేకపాటి మాటలు మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని, రెండు పార్టీలు కూడా ఒక్కటేనని ఆయన అన్నారు.

ఎన్సీపి నేత శరద్ పవార్‌తో వైయస్ విజయమ్మ చర్చలు జరిపిన తర్వాతనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మార్పు వచ్చిందని మరో తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ప్రణబ్‌కు ఓటు, జగన్‌కు బెయిల్ అని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు - రెండు పార్టీలూ ఒక్కటేనని ఆయన అన్నారు.

అయితే, ఆ విమర్శలను కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు కొట్టిపారేస్తున్నారు. ప్రణబ్ గెలుస్తున్నాడు కాబట్టి తామేదో మేలు చేశామని చెప్పుకోవడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Story first published: Wednesday, July 18, 2012, 19:42 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS