విభేదాలకు చెక్: జూనియర్‌ను బుజ్జగించనున్న బాబు!

Published: Wednesday, July 18, 2012, 16:15 [IST]

Balakrishna - Chandrababu Naidu - Jr Ntr
హైదరాబాద్: సంక్షోభంలో ఉన్న తెలుగుదేశం పార్టీని గట్టెక్కించేందుకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీలో ఇబ్బందులను తొలగించాలంటే అంతకు ముందుగా కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగించాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకోసం నడుం బిగించారట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నందమూరి కుటుంబం చెరో మాట మాట్లాడుతుండటం బాబును అసంతృప్తికి గురి చేస్తోందని అంటున్నారు.

అందరిని ఏకత్రాటి పైకి తీసుకు వచ్చేందుకు హీరోలు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, తన తనయుడు లోకేష్ కుమార్ తదితరులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. నారా - నందమూరి కుటుంబాల మధ్యనే కాకుండా, జూనియర్‌కి, హరికృష్ణకి బాలయ్యతో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బాబు తానే ముందుపడి అన్ని సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి హరికృష్ణలో తీవ్ర ఆగ్రహం కలిగించిందట. రాజకీయ కారణాలు లేవని హరికృష్ణ ప్రకటన చేసినప్పటికీ ఈ విషయంలో టిడిపిపై గుస్సాగా ఉన్నారట. తొలుత బాలయ్య, హరికృష్ణకు మధ్య సయోధ్య కుదుర్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇటీవల బాలయ్యతో సమావేశమై చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. హరికృష్ణతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారట.

తన తనయుడు నారా లోకేష్ సమక్షంలోనే బాబు జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తిని చల్లార్చాలని భావిస్తున్నారట. పార్టీకి నందమూరి కుటుంబం ఆవశ్యకతను జూనియర్ దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ సమక్షంలోనే జూనియర్‌తో మాట్లాడితే మళ్లీ మళ్లీ ఇలాంటి మనస్పర్ధలు ఉత్పన్నం కావని బాబు భావిస్తున్నారని అంటున్నారు. గతంలో పలుమార్లు ఫ్యామిలీని బాబు కలిపారు. మరి ఈసారి కూడా ఆయన అనుకున్నది జరిగితే టిడిపికి వచ్చే ఎన్నికలలో ఎదురులేదంటున్నారు. మరి బాబు ప్రయత్నం ఎంత వరకు సాధ్యమౌతుందో చూడాలి.

Story first published: Wednesday, July 18, 2012, 16:15 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS