బి రెడీ: ఎన్నికలపై జగన్, భీంసింగ్‌కు దొరకని ములాఖత్

Published: Friday, July 13, 2012, 8:46 [IST]

YS Jagan
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్‌ను గురువారం పలువురు కలుసుకున్నారు. ఈ క్షణంలో ఆయన కొందరితో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారని తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు జగన్‌ను కలిశారు. తామంతా వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు జగన్‌తో చెప్పారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన జగన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారట. మరోవైపు పలువురు నేతలు జగన్‌ను గురువారం కలిశారు. పలువురిని కలుస్తూ జగన్ తీరిక లేకుండా గడిపారు. ఇటీవల టిడిపి నుండి సస్పెన్షన్‌కు గురైన ఉప్పులేటి కల్పన, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉదయం జగన్‌ను కలిశారు.

జమ్ముకాశ్మీర్‌కు చెందిన పాంథర్స్ పార్టీ నాయకుడు భీంసింగ్ జగన్‌ను కలుసుకునేందుకు చంచల్‌గూడ జైలుకు వచ్చారు. అయితే ములాఖత్ దొరకనందున కలుసుకోకుండానే వెనుదిరిగారు. తాను సుప్రీం కోర్టు న్యాయవాదిని అని, జగన్‌కు న్యాయపరమైన సలహాలు ఇచ్చేందుకు వచ్చానని భీంసింగ్ తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతి మధ్యాహ్నం కలుసుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు అదే జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు కలుసుకున్నారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడారు. తాను మోపిదేవిని కలిసేందుకు వచ్చానని, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను కూడా పరామర్శించానని చెప్పారు. మోపిదేవితో ప్రభుత్వం న్యాయ సహాయం గురించి మాట్లాడానని చెప్పారు.

Story first published: Friday, July 13, 2012, 08:46 [IST]
Topics: ys jagan, ysr congress, rayapati sambasiva rao, tara choudary, bypolls, president polls, వైయస్ జగన్, వైయస్సార్ కాంగ్రెసు, రాయపాటి సాంబశివ రావు, తారా చౌదరి, ఉప ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS