రక్షకులు: కాంగ్రెసుకు రాహుల్, టిడిపికి చంద్రబాబు

Published: Thursday, July 12, 2012, 12:25 [IST]

Rahul Gandhi-Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయాలతో విలవిలలాడుతున్న తమ పార్టీలను చక్కదిద్దుకోవడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్ది, పార్టీని గాడిలో పెట్టడానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఐఎసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ పూనుకుంటే, తమ పార్టీని తిరిగి జవజీవాలు పోయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. తమ తమ పార్టీలకు వారిద్దరే రక్షకులు, సంరక్షకులుగా మారిపోయారు.

రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, పార్టీ పరిస్థితిని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. పార్టీని చక్కదిద్దడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయాలపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు. వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలేమిటనేది ఆయన ముందున్న సవాల్. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రమే కాకుండా రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా రాష్ట్రంలో పార్టీకి రక్షకులు కాదు. వారు అస్త్రాలు మాత్రమే.

రాహుల్ గాంధీ నిర్ణయాలకు, వ్యూహాలకు అనుగుణంగా కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి, ఇతర రాష్ట్ర నాయకులు వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిస్థితులపై వారు రాహుల్ గాంధీకి, ఇతర కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు తమ తమ పద్ధతుల్లో సమాచారం అందించడం, అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవడం వారి పని. తాము చెప్పిన విధంగా కార్యక్రమాలు అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా అధిష్టానం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ఉప ఎన్నికల ప్రచార వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు అందించడమే కాకుండా వారిలో కొందరు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక, తెలుగుదేశం పార్టీకి వస్తే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రమే కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నారు. అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ తాజా స్థితికి కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్టీలోని సీనియర్లు, జూనియర్లు - ఎవరైనా ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. అందువల్ల ప్రస్తుతం పార్టీని చక్కదిద్దుకునే బాధ్యత కూడా ఆయనపైనే ఉంది. అందుకే ఆయన ఇటీవల తీవ్రంగా కసరత్తు చేస్తుండడమే కాకుండా బీసీ విధానం వంటివాటిని రూపొందిస్తూ పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

పార్టీకి ఎవరిని వాడుకోవాలనే విషయాన్ని కూడా చంద్రబాబు నిర్ణయించుకోవాల్సిందే. తనకు పనికి వస్తారంటే ఆయన బాలకృష్ణను వాడుకుంటారు. పార్టీకి ప్రమాదం కాదనుకుంటే కుమారుడు నారా లోకేష్‌ను ఉపయోగించుకుంటారు. సిద్ధంగా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణలను వాడుకుంటారు. వారంతా తాను చెప్పిన మార్గంలో నడవాల్సి ఉంటుంది. మొత్తం మీద, కాంగ్రెసు పార్టీకి రాహుల్ గాంధీ పెద్ద దిక్కుగా మారితే, చంద్రబాబు తానే సంరక్షకుడు, లబ్ధిదారుగా ఉండిపోయారు.

Story first published: Thursday, July 12, 2012, 12:25 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS