దాడి కేసు: సినీ రచయిత చిన్నికృష్ణపై కేసు నమోదు

Published: Wednesday, July 4, 2012, 11:51 [IST]

Chinni Krishna
హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణపై రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదయింది. ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు తనపై చిన్ని కృష్ణ దాడి చేశారని శ్రీపురం కిరణ్ అనే వ్యక్తి ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిరణ్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. శ్రీపురం కిరణ్.. చిన్ని కృష్ణ వద్దే సహ రచయితగా పని చేస్తున్నారు.

మంగళవారం రాత్రి మద్యం సేవించిన చిన్ని కృష్ణ తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని కిరణ్ ఆరోపిస్తున్నారు. తనను తీవ్రంగా దుర్భాషాలాడాడని కిరణ్ చెప్పారు. తీవ్రంగా గాయపర్చారని చెప్పారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు చిన్ని కృష్ణకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అతను పరారీలో ఉన్నారని అనుమానిస్తున్నారు.

కాగా చిన్ని కృష్ణ వద్ద పని చేస్తున్న శ్రీపురం కిరణ్‌కు అతను పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకే దాడి చేశారని అంటున్నారు. ఇరువురి మధ్య ఉన్న గొడవలను పరిష్కరించేందుకు మధ్యవర్తులు కూడా గతంలో ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదట. కాగా గతంలో చిన్ని కృష్ణ పైన రెండు కేసులు ఉన్నాయి. తాజా కేసు మూడోది.

శ్రీపురం కిరణ్ కేసుపై ఓ టీవి ఛానల్‌తో చిన్ని కృష్ణ స్పందించారు. కిరణ్ తనకు అత్యంత సన్నిహితుడని, తాను ఎనిమిదేళ్లుగా అతనికి సహాయం చేస్తున్నానని, వారం రోజులుగా తాను రాష్ట్రంలో లేనని, ఎవరో కుట్ర పన్ని కిరణ్ చేత తనపై కేసులు పెట్టించారని, హైదరాబాద్ రాగానే పోలీసులను కలిసి సమస్యను పరిష్కరించుకుంటానని చెప్పారు.

కాగా చిన్ని కృష్ణ టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు రాసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నరసింహనాయుడు, చిరంజీవి ఇంద్ర చిత్రాలకు ఆయన కథను అందించారు. నరసింహనాయుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో చిన్ని కృష్ణకు మంచి పేరు వచ్చింది.

Story first published: Wednesday, July 04, 2012, 11:51 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS