వైయస్ జగన్ ఎఫెక్ట్: మరిన్ని సంక్షేమ పథకాలు

Published: Wednesday, July 4, 2012, 18:57 [IST]

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభావానికి దిమ్మ తిరిగిన రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప చికిత్సకు సిద్ధమైంది. ఉప ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించలేని కాంగ్రెసు పార్టీ ప్రభుత్వపరంగా ప్రజలను ఆకట్టుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆలోచన చేస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం ఏర్పడిన మంత్రుల కమిటీ ప్రభుత్వ పరంగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలనే సూచన చేయడానికి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. కమిటీ బుధవారం ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో సమావేశమైంది.

ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో లోపాలను సరిదిద్దుతూ, వాటికి మెరుగులు దిద్దుతూ కొత్త పథకాలను ప్రవేశపెట్టే ఆలోచన సాగుతోంది. ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల్లో లోపాలను అధిగమించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరిచేందుకు నిర్దిష్ట కాలపరిమితితో తగిన కార్యాచరణ చేపట్టాలని వారు అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను అధిగమించి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూడా వారు భావించారు.

త్వరలోనే ప్రభుత్వానికి, పార్టీకి తమ నివేదికను అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం లేదని, 2014 ఎన్నికలకు ప్రస్తుత నాయకత్వంతోనే వెళ్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై, పార్టీపై ప్రజలకు విశ్వాసం పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు ఆయన తెలిపారు.

కాగా, ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రుల కమిటీ వేసి సమీక్షకు సిద్ధపడడాన్ని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యతిరేకిస్తున్నారు. మంత్రుల కమిటీ సరిపోదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మేధోమథనం జరగాలని, ఇందుకు పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ఆయన అన్నారు.

Story first published: Wednesday, July 04, 2012, 18:57 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS