అనుమానమెందుకు?: 'టిడిపి'పై తలసాని, ఎన్టీఆర్....

Published: Sunday, July 1, 2012, 9:01 [IST]

Talasani Srinivas Yadav
హైదరాబాద్: రాయల తెలంగాణ కొత్త నాటకమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం అన్నారు. కొందరు వ్యక్తుల స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కాంగ్రెసు పార్టీ పన్నిందని మండిపడ్డారు. రాయల తెలంగాణ అంటూ కాంగ్రెసు కొత్త నాటకానికి తెరతీసిందన్నారు. వారి వారి సొంత రాష్ట్రాలలో దిక్కులేని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, హోంమంత్రి చిదంబరం, మాజీ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీలు ఒక మంచి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ఎపిపై పడ్డారన్నారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఫలితాలు తారుమారు కావడంతో వారు ఈ తరహా కుట్ర పన్నారన్నారు. రాష్ట్రాన్ని రెండుగా లేదా మూడుగా చేయాలనే అధికారం వారికి ఎవరిచ్చారన్నారు. అసలు ప్రజల నాడి ఎలా ఉందన్న దానిపై కేంద్రం ఐదు సంస్థలతో అభిప్రాయ సేకరణ చేయించాలని, పదిహేను రోజులలో ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్రను కొనసాగిస్తే తెలుగువారితో కలిసి ఢిల్లీలోని యుపిఏ ప్రభుత్వాన్ని, కాంగ్రెసును ముట్టడిస్తామని హెచ్చరించారు.

తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో రాష్ట్రానికి తగిన గుర్తింపు లేని దశలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారని, 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. మూడేళ్లుగా రాష్ట్రం ఎటుపోతోందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు నెలకొల్పడానికి ఎవరూ ముందుకు రావట్లేదని ఆరోపించారు.

పెట్టుబడులు పెడితే జైలుకు పోతామని భయం వారిలో నెలకొందన్నారు. కొంతమంది స్వార్థం కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తన కుర్చీని కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై లేదన్నారు. తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని కోరుతూ.. త్వరలోనే మేధావులు, విద్యార్థులతో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నాయకులు రాష్ట్రంలో రోజుకో కొత్త సమస్యను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

తాను తెలంగాణవాదినా లేక సమైక్యాంధ్రవాదినా అనేది ముఖ్యం కాదని, పక్క రాష్ట్రాల నేతలు, రాష్ట్రంలోని కొందరు పనికిమాలిన నేతల కారణంగా రాష్ట్రం నాశనమైపోతోందన్నారు. ఇది పార్టీల సమస్యో, వ్యక్తుల సమస్యో కాదన్నారు. రాష్ట్ర ప్రజల సమస్య అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానా అనుమానం ఎందుకొచ్చిందని విలేకరులను ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో కాకుండా ప్రెస్ క్లబ్‌లో తాను గతంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేశానని చెప్పారు.

Story first published: Sunday, July 01, 2012, 09:01 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS