రాయల తెలంగాణ ప్రతిపాదన వెనక....?

Published: Saturday, June 30, 2012, 17:30 [IST]

Rayala Telangana
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తేవడానికి గల కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆటంకమని చెబుతూ వస్తున్నారు. నిజానికి హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా మారిందనే చెప్పాలి. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అంగీకరించనప్పుడు రాయల తెలంగాణకు ఎలా అంగీకరిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాయల తెలంగాణను కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వంటి రాయలసీమ నాయకులు అంగీకరిస్తున్నారు. హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు, మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనికి సముఖంగానే ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానం కూడా దీనికి అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రకటన ద్వారా ఆ సంకేతాలు అందాయి. కొన్ని మార్పులతో తెలంగాణ ఏర్పడడం ఖాయమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అనడంలో కూడా ఆ ఉద్దేశం ఉండవచ్చు.

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలోని పది జిల్లాలను కలుపుతూ రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన సారాంశం. దీనివల్ల రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలో సీమాంధ్ర రాష్ట్రంలోకి వెళ్తాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కడప జిల్లాకు చెందినవారు కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డిని మినహాయిస్తే కాంగ్రెసుకు గట్టి పోటీ ఇస్తున్న రెండు పార్టీల అధినేతలు సీమాంధ్ర రాష్ట్రంలోకి వెళ్లిపోతారు. ఈ ఇద్దరు నాయకులకు ధీటుగా సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా వినిపించిన చిరంజీవి కాంగ్రెసుకు సిద్ధంగా ఉంటారు.

సీమాంధ్రలో పోటీని చంద్రబాబు, వైయస్ జగన్, చిరంజీవిలకు పరిమితం చేసి, రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా ఆ రెండు పార్టీలను బలహీనపరచాలనేది కాంగ్రెసు అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణకు చెందని రెండు జిల్లాలు కొత్త రాష్ట్రంలోకి రావడం వల్ల తెలంగాణలో బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దెబ్బ తీనే అవకాశం ఉంటుంది.

కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ముస్లిం మైనారిటీల వల్ల రాయల తెలంగాణలో తమ ప్రాబల్యం చాటు కోవచ్చునని మజ్లీస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసి తమకు రాజకీయ ప్రయోజనం జరిగేలా రాష్ట్ర విభజన జరపాలనే కాంగ్రెసు అధిష్టానం వ్యూహంలో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు వచ్చిందని అంటున్నారు.

కాగా, తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణను తెలంగాణ నాయకులు అంగీకరించరు కాబట్టి తెలంగాణ సమస్యపై మరింత నాన్చుడు ధోరణి అవలంబించడానికి వీలవుతుందనే ఉద్దేశం కూడా ఆ ప్రతిపాదన వెనక ఉన్నట్లు చెబుతున్నారు.

Story first published: Saturday, June 30, 2012, 17:30 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS