పిలిస్తే మళ్లీ వస్తా, కావాలనే ఆరోపణలు: ఎమ్మెల్యే కవిత

Published: Wednesday, June 20, 2012, 13:48 [IST]

Kavitha
వరంగల్: రాజకీయ ఉద్దేశ్యంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కవిత బుధవారం అన్నారు. మద్యం సిండికేటులో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు ప్రతినిధులను గత మూడు రోజులుగా ఎసిబి(అవినీతి నిరోధక శాఖ) విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముడుపుల ఆరోపణలు ఎదుర్కొన్న కవితను కూడా వరంగల్ జిల్లాలో ఎసిబి అధికారులు విచారించారు.

ఆమెను గంటపాటు అధికారులు విచారించారు. విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై రాజకీయ దురుద్దేశ్యంతోనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నున్నా రమణతో తనకు రాజకీయ కక్షలు ఉన్నాయని, అందుకే తన పేరును ఈ కేసులోకి లాగారని అన్నారు. ఎసిబి అధికారులు అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారని, వారు పిలిస్తే మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.

ఎసిబి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. తన పాత్ర ఏమీ లేదని చెప్పానని తెలిపారు. ఎసిబి విచారణ రాజకీయ కోణంలో జరగడం లేదని అన్నారు. మరోవైపు వరంగల్ ఎసిబి అధికారులు నున్నా రమణను విచారిస్తున్నారు. నున్నా రమణ మద్యం సిండికేటులో ఇటీవల అరెస్టైన విషయం తెలిసిందే.

కాగా ఎమ్మిగనూరు శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చెన్నకేశవ రెడ్డి మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మద్యం సిండికేట్‌ల కేసులో లంచం తీసుకున్నట్లు చెన్నకేశవ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎసిబి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరయ్యారు.

మద్యం సిండికేట్ల నుండి నెలకు నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఎసిబి విచారణలో చెన్నకేశవ రెడ్డి ముడుపులు తీసుకున్నట్లుగా బయటపడిందని తెలుస్తోంది. అందువల్లే ఆయనను విచారించారు. చెన్నకేశవ రెడ్డి ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

ఎసిబి అధికారులు ఆయనను కర్నూలు జిల్లాలోని ఎసిబి కార్యాలయంలో సుమారు గంటన్నరకు పైగా విచారించారు. విచారణ అనంతరం ఆయనను మీడియా పలకరించగా నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు. విచారణ ఎలా జరిగిందో ఎసిబినే అడగండంటూ చెబుతూ వెళ్లిపోయారు. చెన్నకేశవ రెడ్డిని ఎసిబి జెడి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

Story first published: Wednesday, June 20, 2012, 13:48 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS