ఎమ్మిగనూరు: అనుచరులతో టిడిపి అభ్యర్థి బివిఎం ఢీ

Published: Monday, June 11, 2012, 10:49 [IST]

Chennakeshav Reddy - BV Mohan Reddy
కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గతంలో అనుచరులుగా ఉన్న వారే ఇప్పుడు ఆయా పార్టీల నుండి బరిలో ఉన్నారు. ఒకప్పటి తమ నాయకుడి మీదే ప్రత్యర్థులుగా నిలిచారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ముక్కోణపు పోటీ జరుగుతోంది. మాజీ మంత్రి బివి మోహన రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండగా.. గతంలో ఆయన అనుచరులుగా పని చేసిన ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా, రుద్ర గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2004, 2009 ఎన్నికల్లో చెన్నకేశవ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బివిపై గెలిచారు. అప్పటి వరకు టిడిపిలో ఉన్న రుద్ర గౌడ్ కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం అభ్యర్థులు సానుభూతిని నమ్ముకుని ముందుకు సాగుతుంటే.. సామాజికవర్గ ఓట్లపై కాంగ్రెస్ అభ్యర్థి ఆధారపడ్డారు. జగన్ జైలుకు వెళ్లడం, విజయలక్ష్మి ప్రచారం ద్వారా వచ్చే సానుభూతి గట్టెక్కిస్తుందని చెన్నకేశవ రెడ్డి ధీమాగా ఉన్నారు.

అయితే, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోయిందని, మద్యం, ఇసుక వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని ఆయన వందల కోట్లు గడించారనే అరోపణలను ప్రత్యర్థి పార్టీలు ప్రధాన ప్రచారాస్త్రంగా తెరపైకి తెచ్చాయి. ఇక ఉప ఎన్నికల ప్రచారానికి రెండు నెలల ముందే ప్రచార బరిలోకి దిగిన టిడిపి అభ్యర్థి మోహన రెడ్డి ఎండల్లో తిరగడంతో అనారోగ్యం పాలయ్యారు. వారం రోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్ సమీపిస్తున్నా విశ్రాంతిలోనే ఉంటూ వీల్ చైయిర్‌పై అప్పుడప్పుడూ ప్రచారం చేస్తున్నారు.

నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, రెండుసార్లు వరుస ఓటములతోపాటు ఇటీవలి అనారోగ్యం ద్వారా వచ్చే సానుభూతి తనను గట్టెక్కిస్తుందని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో, పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ఎంపి కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, రాష్ట్ర మంత్రి టిజి వెంకటేశ్ చెమటోడుస్తున్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అంతంతమాత్రంగా ఉన్న పార్టీని ప్రచారం ముగిసే సమయానికి కొంత బలోపేతం చేశారన్న అంచనాలు ఉన్నాయి.

ఇక్కడ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బిసి నేత. నియోజకవర్గంలో మొత్తం 1,89,258 ఓట్లుండగా అందులో బీసీల ఓట్లు లక్షకుపైగా ఉన్నాయి. వారిలో వాల్మీకులు 43 వేలు, సాలె, కుర్మి 27,500, గొల్ల, కురవ, ఉప్పర కలిపి సుమారు 30 వేల ఓట్లున్నాయి. ఈ నేపథ్యంలో బీసీల ఓట్లే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, June 11, 2012, 10:49 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS