సాక్షి మీడియాపై చర్యలు అవసరం లేదు: భన్వర్‌లాల్

Published: Wednesday, June 6, 2012, 19:48 [IST]

Bhanwar Lal
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానెల్‌పై చర్యలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చేసిన ఫిర్యాదుపై తాము న్యాయ సలహా తీసుకున్నామని, సాక్షి మీడియాపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసే వార్తలు సాక్షి మీడియాలో వస్తున్నాయని, అందువల్ల ఆ మీడియాను ప్రసారాలను ఆపించాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సిఇసికి ఫిర్యాదు చేశాయి. సాక్షి మీడియాలోని వార్తాకథనాలను చెల్లింపు వార్తలుగా పరిగణించాలని కూడా ఆ పార్టీలు కోరాయి. ఈ మేరకు పలుమార్లు భన్వర్‌లాల్‌ను కలిసి ఆ పార్టీల నాయకులు వినతిపత్రాలు సమర్పించాయి.

గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల అఫిడవిట్లు మాత్రమే వైబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. గత ఉప ఎన్నికల్లో పొరపాటు అందరి అఫిడవిట్లను వెబ్‌సైట్‌లో పెట్టామని, ఈసారి గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల అఫిడవిట్లు మాత్రమే పెడుతున్నామని ఆయన చెప్పారు. అఫిడవిట్లు కావాలంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని, దరఖాస్తు చేసుకుంటే తాము ఇస్తామని ఆయన చెప్పారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఇచ్చిన స్టార్ కాంపెయినర్స్ జాబితా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.

Story first published: Wednesday, June 06, 2012, 19:48 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS