జగన్ రౌడీలా వ్యవహరిస్తున్నారు: విహెచ్, నేతల ఫైర్

Published: Wednesday, May 30, 2012, 11:01 [IST]

V Hanumanth Rao
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రౌడీలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు మంగళవారం అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చారు. జగన్ అరెస్ట్‌తో ఇబ్రహీంపట్నం వద్ద బస్సుపై జరిగిన దాడిలో గాయపడి మృతి చెందిన నాగగోపాల్ కుటుంబాన్ని ఈ సందర్భంగా ఆయన పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రౌడీలా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయన అక్రమాలకు పాల్పడడంతో సిబిఐ అరెస్ట్ చేస్తే అందుకు అమాయకులు ప్రాణాలను తీస్తున్నాడని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు రౌడీ మూకలను రెచ్చగొట్టి బస్సుపై దాడి చేయించి డ్రైవర్ నాగగోపాల్ ప్రాణాలను తీశారన్నారు. ఆయన కుటుంబానికి అన్యా యం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారందర్ని వెంటనే అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.

పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడిలో డ్రైవర్ నాగగోపాల్ మృతి చెందినా పోలీసులు సక్రమంగా స్పందించలేదని విహెచ్ ఆగ్రహించారు. పోలీసుల తీరు దారుణంగా ఉందన్నారు.

శవాన్ని ఇబ్రహీంపట్నం నుంచి పంపించేటప్పుడు కూడా పట్టించుకోలేదన్నారు. నెల్లూరు పోలీసులు స్పందించకపోవడం మంచి పద్దతి కాదన్నారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీని కలిశారు. నాగగోపాల్ మరణానికి కారకుడైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వాస్తవాలు వెల్లడించి అప్రూవర్‌గా మారాల్సిందిగా కొడుక్కు సలహా ఇవ్వాలని వైయస్ విజయమ్మకు మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సూచించారు. మంగళవారం కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదని, ముందే మేల్కొని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.

జగన్ ఎన్నటికీ సిఎం కాలేడని, అసలు పోటీచేసే అర్హత కూడా ఉండదని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజాహిత యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తండ్రిని అడ్డం పెట్టుకొని పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు గుంజిన జగన్, చివరకు వారిని జైలుపాలు చేశాడన్నారు.

ప్రధాని పదవినే త్యాగం చేసిన సోనియా.. వైయస్ మరణించిన మూడు నెలలకే ఆయన భార్య విజయలక్ష్మిని ఎమ్మెల్యేని చేశారని గుర్తుచేశారు. జగన్‌ను అరెస్టు చేస్తే లక్ష చేతులు... కోటి చేతులు లేస్తాయని అరాచక ప్రకటనలు చేసినవారంతా ఇప్పుడు పత్తాలేరని ఎద్దేవా చేశారు.

జగన్ అరెస్ట్‌పై ఆయనతోపాటు వైయస్సార్ కాంగ్రెసు నాయకులే ప్రచారం చేసుకున్నారని మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. చివరకు అదే ఫలించి ఆయన అరెస్టయ్యారని వ్యాఖ్యానించారు. సిబిఐ ఒకరి చెప్పుచేతలలోనిది కాదని, కుంభకోణాల్లో మంత్రుల ప్రమేయం ఉంటే వారినీ అరెస్ట్ చేస్తారని స్పష్టం చేశారు.

Story first published: Wednesday, May 30, 2012, 11:01 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS