ఎమ్మెల్సీకి, కాంగ్రెస్‌కు జగన్ వర్గం నేత ఎస్వీ రాజీనామా

Published: Wednesday, May 9, 2012, 13:22 [IST]

SV Mohan Reddy
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనమండలి సభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారం కాంగ్రెసు పార్టీకి, శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

కాగా ఎస్వీ మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ మండలి సభ్యుడు అయినప్పటికీ గత కొంతకాలంగా జగన్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెసు పార్టీలోనే ఉన్నప్పుటికీ ఆ పార్టీతోనే సన్నిహత సంబంధాలు నెరుపుతున్నారు. దీంతో కాంగ్రెసు పార్టీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరింది. దీనిపై మంగళవారం ఎస్వీ మోహన్ రెడ్డి మండలి చైర్మన్ చక్రపాణి ఎదుటకు వచ్చి వివరణ ఇచ్చారు.

ఆయన తన ఎమ్మెల్సీ రాజీనామా పత్రాన్ని చైర్మన్‌కు పంపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా ఉన్నన్నాళ్లు తాను ఆ పార్టీలో కొనసాగానని చెప్పారు. తాను ప్రస్తుత పరిస్థితులను చూసి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను ఎప్పుడూ వైయస్ కుటుంబం వెంటే ఉంటానని చెప్పారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కై జగన్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని అన్నారు. తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిన వైయస్ కుటుంబం వెంటే ఉంటానని అన్నారు.

తాను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరలేదని, ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఎస్వీ మోహన్ రెడ్డి మంగళవారం శాసన మండలి చైర్మన్ చక్రపాణికి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంపై ఎస్వీ ఉదయం చైర్మన్‌కు వివరణ ఇచ్చారు. శాసనమండలి సభ్యుడిగా తన గెలుపుకు గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సహాయం చేశారని చెప్పారు.

జగన్‌తో ఉన్న అనుబంధం కారణంగానే తాను అతనితో మాట్లాడుతున్నానని చెప్పారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పారు. ఒకవేళ తాను అలాంటివి చేసినట్లు చెబితే నిరూపించాల్సిన బాధ్యత పార్టీ పైనే ఉందని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని కాని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కానీ మరే ఇతర పార్టీ నేతల పైన కానీ విమర్శలు చేయలేదని చెప్పారు. తాను ప్రస్తుతానికి కాంగ్రెసులోనే ఉన్నానని స్పష్టం చేశారు.

మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి, మాజీ మంత్రి శంకర రావుతో సహా పలువురు పార్టీ నేతలు ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శిస్తున్నారని చెప్పారు. వారు చేసేవి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కావా అని ప్రశ్నించారు. ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను జగన్ మద్దతుతో గెలిచానని చెప్పారు. ఆ అనుబంధం కొనసాగుతుందన్నారు.

కాగా ఎస్వీ మోహన్ రెడ్డికి శాసనమండలి చైర్మన్ ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావని, అనర్హత పిటిషన్ పైన వివరణ ఇవ్వాలని గతంలో నోటీసులు పంపారు. మోహన్ రెడ్డి వివరణ తీసుకున్న చైర్మన్ విచారణను 18వ తేదికి వాయిదా వేశారు. కాంగ్రెసు తరఫున పార్టీ విప్ శివ రామి రెడ్డి వాదనలు వినిపించారు. అయితే తాను కాంగ్రెసులోనే ఉన్నానని వివరణ ఇచ్చిన తర్వాత రోజే ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీకి, మండలి పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

Story first published: Wednesday, May 09, 2012, 13:22 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS