లోకేష్ కోసం: జూ.ఎన్టీఆర్ వర్గంపై కత్తి

Published: Wednesday, July 11, 2012, 12:32 [IST]

Jr Ntr-Nara Lokesh
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ కుమార్ కోసం హీరో జూనియర్ ఎన్టీఆర్ వర్గాన్ని పక్కకు పెట్టాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నారా అంటే కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అంటున్నారు. బుధవారం కొడాలి నాని గుడివాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు లోకేష్ కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులను వ్యూహాత్మకంగా బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు.

ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. గత కొన్నాళ్లుగా జూనియర్ ఎన్టీఆర్‌కు పోటీగా లోకేష్ పేరు తెరపైకి వస్తోంది. గతంలో ఓసారి చంద్రగిరి నియోజకవర్గం నుండి లోకేష్ పేరును తెరపైకి తీసుకు వచ్చినప్పుడు జూనియర్ వర్గీయులు ఆయన పేరును తీసుకు వచ్చారు. అప్పటి నుండి బాబు సైలెన్స్ అయిపోయారు. జూనియర్ తాను ఇప్పుడప్పుడే రాజకీయాలలోకి రానని చెప్పాక మరోసారి లోకేష్ పేరు తెరపైకి వస్తోంది.

దీంతో బాబు వ్యూహాత్మకంగానే జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ చెప్పేందుకు లోకేష్ పేరును తెర పైకి తీసుకు వస్తున్నారని అంటున్నారు. అందుకోసం ఆయన ముందుగానే జూనియర్ వర్గాన్ని పార్టీ నుండి బయటకు పంపిస్తున్నారనే విధంగా నాని వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. జూనియర్ వర్గానికి చెందిన కృష్ణా జిల్లాకే చెందిన వల్లభనేని వంశీమోహన్ కూడా బాబు తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

ఆయన కూడా ఏ క్షణంలోనైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొడతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య కూడా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలా జూనియర్ వర్గానికి చెందిన నేతలను ఉద్దేశ్యపూర్వకంగా బయటకు పంపించి లోకేష్‌కు పట్టం కట్టాలనేది బాబు వ్యూహమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బాబు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావిస్తున్న జూనియర్ వర్గం నేతలు లోకేష్ వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళనలో ఉన్నారని అంటున్నారు.

అయితే నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు కూడా తన తనయుడు లోకేష్‌ను రాజకీయాలలోకి తీసుకు రావాలని భావించలేదని, పార్టీ నేతలు కోరినప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాలలో బిజీగా ఉన్న లోకేష్‌ను ఇటు వైపు మరల్చడం బాబుకు ఇష్టం లేదని చెబుతున్నారు. నాని వ్యాఖ్యలలో ఎంతమాత్రమూ నిజం లేదని చెబుతున్నారు.

Story first published: Wednesday, July 11, 2012, 12:32 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS