ఎన్టీఆర్ నోటి వెంట బాలయ్య వ్యాఖ్యలు వస్తే...

Published: Sunday, July 22, 2012, 11:03 [IST]

Balakrishna - Jr Ntr
సంక్షోభంలో ఉన్న తెలుగుదేశం పార్టీని 2014లో ఎలాగైనా అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెడుతూనే మరోవైపు ఫ్యామిలీలోని విభేదాలను దూరం చేసేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బిసి నినాదం కారణంగా ఇప్పటికే పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చింది.

అదే ఊపుతో.. రాజకీయంగా ఎదుర్కొంటున్న తెలంగాణ, ఎస్సీ రిజర్వేషన్ వంటి పలు సమస్యలపై త్వరలో బాబు ఓ క్లారిటీకి రానున్నారని తెలుస్తోంది. ఇలా పార్టీలో కొత్త ఊపు వస్తున్న తరుణంలో ఫ్యామిలీ విభేదాలకు చెక్ చెప్పడమే మంచిదని బాబు భావిస్తున్నారు. పార్టీలో ఎంత ఉత్తేజం ఉన్నప్పటికీ నందమూరి-నారా కుటుంబాలలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం నష్టం కలిగిస్తుందని బాబు భావిస్తున్నారు.

అందుకోసం ఆయన ఇంటి సమస్యలను తీర్చేందుకు ముందడుగు వేశారనే వార్తలు గత నాలుగైదు రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ఇప్పటికే బాబే 2014 ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించాడు. అలాంటి వ్యాఖ్యలే జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ నోటి నుండి కూడా వస్తే బావుంటుందని తెలుగు తమ్ముళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. సిఎం అభ్యర్థి బాబే అని తెలిసినప్పటికీ వారి నోటి నుండి ఆ వ్యాఖ్యలు వస్తే విభేదాల అంశం సమసి పోతుందని తమ్ముళ్లు భావిస్తున్నారని అంటున్నారు. గతంలో జూనియర్.. బాబే నాయకుడు అని పలుమార్లు చెప్పారు. కానీ విభేదాల ప్రచారం నేపథ్యంలో మరోమారు చెబితే భావుంటుందని భావిస్తున్నారట.

విభేదాలకు చెక్ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా బాబు.. బాలకృష్ణతో, హరికృష్ణలతో, నారా లోకేష్ సమక్షంలో జూనియర్ ఎన్టీఆర్‌తోనూ మాట్లాడేందుకు సిద్ధమయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే లీడర్ షిప్ విషయానికి వస్తే లోకేష్, జూనియర్‌ల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా చేసేందుకు బాలయ్యకు కీలక బాధ్యతలు అప్పగించి ఆయన ఆధ్వర్యంలో వారిద్దరూ నడిచే విధంగా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా బాలయ్యకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం లేదా మరొకటా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ 2014 ఎన్నికలకు పని చేసే విధంగా బాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట.

Story first published: Sunday, July 22, 2012, 11:03 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS